హమారా ప్రసాద్ రాస్తున్న పుస్తకాన్ని నిలిపివేయాలి - చందు
‘కల్పిత నాయకుడు’ అంటూ అంబేద్కర్‌ను అవమానించడాన్ని ఖండిస్తున్నాం
హమారా ప్రసాద్ రాస్తున్న పుస్తకాన్ని నిలిపివేయాలి - చందు
షాద్‌నగర్, సెప్టెంబర్ 15 (త్రినేత్ర ట్రూత్‌లైన్): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగులారపు వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్‌పై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చందు తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.
హమారా ప్రసాద్ ‘కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడం కోట్లాది అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని చందు ఆరోపించారు. అంబేద్కర్‌పై అసత్యాలు, కల్పిత విషయాలను ప్రచారం చేయడాన్ని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
సోషల్ మీడియాలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను తక్షణమే అరికట్టి, హమారా ప్రసాద్‌పై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే హమారా ప్రసాద్ రాస్తున్న పుస్తకాన్ని నిలిపివేయాలని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్న వ్యక్తిపై ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. హమారా ప్రసాద్ అంబేద్కర్ వాదులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చందు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకునే పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని చందు హెచ్చరించారు.
