సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు జరిగింది ముమ్మాటికీ విద్రోహమే
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు జరిగింది ముమ్మాటికీ విద్రోహమే
తెలంగాణ ప్రజలపై సైనిక దమనకాండను చరిత్ర నుంచి చెరిపివేయలేరు: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
కట్టంగూర్, సెప్టెంబర్ 12 (త్రినేత్ర ట్రూత్‌లైన్): 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు జరిగింది విమోచనం లేదా విలీనం కాదని, తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విద్రోహమే జరిగిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కార్యదర్శి సాగర్ అన్నారు. సెప్టెంబర్ 17ను జిల్లా వ్యాప్తంగా చీకటి రోజుగా, విద్రోహ దినంగా పాటించాలని పార్టీ శ్రేణులకు, ప్రజాస్వామికవాదులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో సాగర్ మాట్లాడారు. నిజాం నవాబు, ఖాసీం రిజ్వీ, రజాకార్ల అరాచకాలు ఒకవైపు కొనసాగుతుండగా, గ్రామాల్లో దొరలు, భూస్వాములు, జాగీర్దార్లు, పటేల్–పట్వారీలు దోపిడీ, అణచివేత, వెట్టిచాకిరీ, హింస, దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, పేదలు, కూలీలు, మహిళలు, సామాన్య ప్రజలు కమ్యూనిస్టు నాయకత్వంలో చారిత్రక పోరాటాన్ని నిర్మించారని పేర్కొన్నారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం పాలన పునాదులను కదిలించిందని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు ‘పోలీస్ యాక్షన్’ పేరుతో ‘ఆపరేషన్ పోలో’ ద్వారా భారత సైన్యం తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం సైనిక చర్యలు తీవ్రతరం అయ్యాయని తెలిపారు. ఈ కాలంలో కమ్యూనిస్టులు, రైతాంగ పోరాటంలో పాల్గొన్న ప్రజలు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందువులు–ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సాగర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేవలం ఒక పాలకుడి నుంచి మరొక పాలకుడికి అధికార మార్పిడిని కోరుకోలేదని, దొరలు–భూస్వాముల ఆధిపత్యం అంతం కావాలని, వెట్టిచాకిరీ నిర్మూలన, భూమి పేదలకు దక్కాలని, సామాజిక విముక్తి కోసం పోరాడారని తెలిపారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17 చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పాలకుల రాజకీయ ప్రచారానికి చరిత్రను బలిచేయవద్దని ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17ను జిల్లా వ్యాప్తంగా చీకటి రోజుగా పాటించాలని పార్టీ శ్రేణులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి, నాయకులు గజ్జి రవి, రావుల లింగయ్య, వేముల శంకర్, బూరుగు సత్తయ్య, సిలువేరు జానయ్య, బొంగరాల నర్సింహా, శ్రీను, చంద్రయ్య, అంజయ్య, మల్లయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
